కొల్లేరులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేయండి
మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండవని అవగాహన కల్పించండి
3 నెలల్లోపు సరిహద్దులు ఖరారు చేయండి
ఏపీకి సుప్రీంకోర్టు ఆదేశం
కొల్లేరు సరస్సులో సహజ నీటిప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతేడాది డిసెంబరు 11న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం మూడునెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారుచేయాలని ఆదేశించింది.
మున్సిపల్ ఘనవ్యర్థాలు, చుట్టుపక్కల పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని ఈ సరస్సులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని నిర్దేశించింది. ఈ ఉత్తర్వులు మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించవని, రాష్ట్రప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డుతగలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొల్లేరు సంరక్షణ కోసం 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టుధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ *కాకినాడకు చెందిన కె.మృత్యుంజయరావు గతేడాది సెప్టెంబరు 1న అప్పటి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలుచేసిన పిటిషన్‌పై గురువారం విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
గడువులోగా ధ్వంసం చేయాలి
‘‘ఈ సరస్సులోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న చిన్న, పెద్ద చేపల చెరువులను నిర్దిష్ట గడువులోగా ధ్వంసం చేయాలి. వందెకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్న చెరువులను 15 రోజుల్లోపు, మిగిలిన చెరువులను 2006 మే 31లోపు తొలగించాలని కేంద్ర సాధికార సంస్థ (సీఈసీ) 2006 మార్చి 20న ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం, అధికారులు ఆ నివేదికలోని అంశాలను తు.చ. తప్పకుండా అమలుచేయాలి. చేపల పెంపకంలో ఉపయోగించే ఎరువుల రవాణాను నిలిపేయాలి. చేపల చెరువులను ధ్వంసం చేసే కార్యక్రమం 2006 ఏప్రిల్ 20 నుంచే మొదలుపెట్టాలని 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం అమలుచేయనందున కోర్టుధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ దాఖలైంది.
ఆక్రమణలో 15,339 ఎకరాలు
ఆర్‌టీఐ కింద రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 15,339 ఎకరాలు వివిధ వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్లు అమికస్ క్యూరీ తెలిపారు. సరస్సు 901 చ.కి.మీ. మేర విస్తరించినా, అందులో 308.55 చ.కి.మీ. మాత్రమే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింద నోటిఫై చేసినట్లు చెప్పారు. 6,908.48 హెక్టార్లలో ఆక్వాకల్చర్ ఉంది. ప్రస్తుతం కోర్టు ముందుంచిన సమాచారం ప్రకారం చెరువుగట్ల నిర్మాణం వల్ల సరస్సులో సహజనీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.
కలెక్టర్ అనుమతులతోనే భారీగా పెట్టుబడులు పెట్టి చేపల చెరువులు ఏర్పాటుచేసుకున్నవారి ప్రయోజనాలు రక్షించాలన్న వినతిని కోర్టు తిరస్కరిస్తోంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో వాణిజ్య కార్యకలాపాలు నీటిప్రవాహాన్ని మళ్లించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లోపల, బయట నీటిమట్టాన్ని తగ్గిస్తున్నాయి. వాటిని పూర్తిగా నిషేధించాలి. కోర్టు ఉత్తర్వుల అమలును వ్యతిరేకిస్తున్న రైతులతో రాష్ట్రప్రభుత్వం చర్చించి వారికి అవగాహన కల్పించాలి. డిసెంబరు 11న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి మూడునెలల్లోపు రాష్ట్రప్రభుత్వం కచ్చితమైన డిజిటల్ మ్యాప్‌లతో ఈ చిత్తడి నేలల సరిహద్దులను క్షేత్రస్థాయిలో ఖరారుచేయాలి. ఆక్రమణలను తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నదీ చెప్పాలి. చిత్తడి నేలలను సరిగా సంరక్షించడం లేదని కోర్టుకు సమర్పించిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ సమస్యలను రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలి’’ అని ధర్మాసనం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.
అధికారుల కుమ్మక్కును కొట్టేయలేం
ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల కుమ్మక్కును కొట్టి పారేయలేమని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యానించారు. ఆక్రమణలు తొలగించినా అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాష్ట్రప్రభుత్వానికి జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ సూచించారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోందని రాష్ట్రప్రభుత్వం చెప్పిన విషయంలోనూ మెరిట్ ఉందని, అందుకే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తున్నామని జస్టిస్ బీఆర్ గవాయి స్పష్టంచేశారు. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదావేశారు. రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ గత అక్టోబరులో కోర్టు జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి ఇప్పటివరకు 5వేల ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా అక్కడికి వలసపక్షుల రాక పెరిగిందన్నారు. 3 నెలల్లో మొత్తం సరిహద్దులను నిర్ధారిస్తామని, అందువల్ల తమకు 8 వారాల సమయం ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరఫున అమికస్‌క్యూరీ కె.పరమేశ్వర్ క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

Social Plugin