VSK NEWS : ప్రభుత్వ ఖజానాను లూటీ చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం - ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను లూటీ చేసిందని, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం 32 మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన రూ.63 లక్షల చెక్కులను ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ద్వజమెత్తారు.
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఎంపీ ఆరోపించారు. ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో నిధుల లేమి కారణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు అవరోధంగా మారిందని ఎంపీ తెలిపారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. అలాగే స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయని, ప్రభుత్వ భూములతో పని లేకుండా ప్రైవేట్ భూములను పారిశ్రామికవేత్తలే కొనుగోలు చేసి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేవారిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎంపీ పేర్కొన్నారు.
ఏలూరులో ఎక్కడ గాని పెద్ద పెద్ద పరిశ్రమలు లేవని, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికవాడగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, నూతన రైల్వే స్టేషన్ల మంజూరు వంటి అభివృద్ధి పనులపై దృష్టి సారించినట్లు ఎంపీ స్పష్టం చేశారు.
ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల నియంత్రణకు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఇటీవల కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ తెలిపారు. ఫ్లై ఓవర్ల నిర్మాణానికి సంబంధించి మార్చిలో టెండర్లు పించే అవకాశం ఉందని , రానున్న ఐదు నెలల్లో పనులు పూర్తిచేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టిందని ఎంపీ పేర్కొన్నూరు. పొగాకు రైతులకి సంబంధించి జీఎస్టీ 29% నుంచి 34% పెంచేందుకు కేంద్రం ఆలోచన చేస్తుందని, జీఎస్టీ పెంచవద్దని ఇటీవల కేంద్ర మంత్రుకి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ తెలిపారు. జీఎస్టీ పెంచితే పొగాకు రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున తలవంతు ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ చెప్పారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్న దృష్టికి తీసుకురావాలని, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు.

Social Plugin