Ticker

6/recent/ticker-posts

విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో డబుల్ డెక్కర్, సీఎం చంద్రబాబు సమీక్ష


VISAKHA Metro Rail VSK NEWS: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించనున్న మెట్రో రైల్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే విజయవాడ, వైజాగ్ నగరాల్లో పలు ప్రాంతాల్లో రోడ్డు ఉన్న చోట డబుల్ డెక్కర్ మెట్రో ఏర్పాటు చేసే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. కోల్‌కతాలో నిర్మించినట్లు ఆంధ్రప్రదేశ్‌లోనూ మెట్రో రైలు ప్రాజెక్టులు నిర్మించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా ఏపీకి మెట్రో ప్రాజెక్టు ఉందని గుర్తు చేశారు.


2017 వరకు 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించే విధానం అమలులో లేదని.. అయితే 2017 పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుకు 100 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లించి చేపట్టినట్లు పేర్కొన్నారు. రూ.8,565 కోట్లతో కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించినట్లు వెల్లడించారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, రైల్వే శాఖలు సంయుక్తంగా కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాయని వివరించారు. ఇప్పుడు కోల్‌కతా తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌తో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

ఇక ఏపీ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం అయినా.. లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు సాయం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇక విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారని తెలిపారు. ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లై ఓవర్.. ఆపైన మెట్రో రైలు వస్తుందని వివరించారు.