KARNATAKA VSK TV NEWS: మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారని వస్తున్న ఊహాగానాలను ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. అయితే ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న బస్సు ఛార్జీలను 15 శాతం పెంచాలని తీసుకున్న నిర్ణయానికి కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పెంపు జనవరి 5వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు కర్ణాటక ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 ఏళ్లుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ పథకం కోసం కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల రూ. 417 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.
కర్ణాటకలో ఆర్టీసీకి గత కొన్నిరోజులుగా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలోనే బస్ ఛార్జీలను దాదాపు 15 శాతం పెంచితే తద్వారా కర్ణాటక ఆర్టీసీ సంస్థకు ఒక రోజుకు రూ. 7.84 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెంచిన బస్సు ఛార్జీల ద్వారా అదనపు ఆదాయం సమకూరి నష్టాలను పూడ్చుకునేందుకు అవసరం అవుతుందని సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు కర్ణాటకలోని ఆర్టీసీకి చెందిన 4 సంస్థల్లో ఈ బస్ ఛార్జీల పెంపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కర్ణాటక స్టేట్ రోడ్డు కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ), కల్యాణ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషణ్ (ఎన్‌డబ్యూకేఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) సంస్థలకు చెందిన బస్సుల్లో జనవరి 5వ తేదీ నుంచి ఈ బస్ ఛార్జీల పెంపు వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

Social Plugin