అమిత్ షా గో బ్యాక్ అంటూ ఏలూరులో వామపక్షాల నిరసన
అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి.
VSK NEWS ఏలూరు పార్లమెంటులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల పార్టీల రాష్ట్ర పిలుపు మేరకు ఆదివారం ఏలూరులోని సిపిఎం, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరు శ్రీమన్నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరితంగా, అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
75 ఏళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దేశానికి మనువాద, మతోన్మాద భావజాలం ప్రమాదకరంగా మారిందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో దళిత, గిరిజన, మహిళలపైన, మైనార్టీల పైన దుర్మార్గమైన దాడులు, అవమానాలు జరుగుతున్నా ఏమాత్రం మాట్లాడని ప్రధాని మోడీ అంబేద్కర్ ను అవమానపరిచినా అమిత్ షాను వెనుకేసుకురావడం దుర్మార్గమన్నారు. ఈ తరహా ధోరణులు పెత్తందారీ పోకడలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాజ్యాంగ బద్దంగా లభించిన కేంద్ర హోంశాఖ మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాను తొలగించాలని కోరారు.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. దేశ లౌకిక తత్వాన్ని, మతసామరస్యాన్ని, రాజ్యాంగ విలువలను పరిరక్షించుకునేందుకు పోరాటమే మార్గమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలు చేయని కేంద్ర హోం మంత్రి రాష్ట్రంలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎర్ర తివాచీలు పరచడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి. రామకృష్ణ,సీపీఎం నాయకులు పిచ్చుక ఆదిశేషు, ఎ.శ్యామలారాణి,ఎం. రామాంజనేయులు, ఎస్.సత్యనారాయణ, ఏసుబాబు,మీసాల సత్యనారాయణ, సిపిఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ నాయకులు ఈమని మల్లిక,కాకి నాని, మహర్షి, జి.రాంబాబు, నాగేశ్వరరావు, అప్పారావు, త్రినాధ్, రవణ, అన్నవరం,విష్ణు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Social Plugin